KCR Discharge: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. షుగర్, సోడియం లెవల్స్‌లో స్వల్ప హెచ్చుతగ్గులు రావడంతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుపడటంతో వైద్యులు డిశ్చార్చి చేశారు. దీంతో ఆసుపత్రి నుంచి నేరుగా నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు.
కొంతకాలంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కేసీఆర్ గురువారం నీరసంగా ఉండటంతో వ్యక్తిగత వైద్యుడు చేత పరీక్షలు చేయించుకున్నారు. అయితే బ్లడ్ షుగర్ లెవల్స్ తేడా ఉన్నాయని.. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని సూచించారు. దీంతో గురువారం రాత్రి ఆయన యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసిన వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు, అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన కుమార్తె కవిత రెండు సార్లు హాస్పిటల్‌కకు వెళ్లి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్‌ను ఆసుపత్రిలో కలిశారు. వారితో ఆయన తాజా రాజకీయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందనే చర్చ వచ్చింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి ప్రభుత్వం వితండ వాదన చేస్తుందని చర్చించారు. దీనిపై త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల సమస్యకు తానే కారణమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సమగ్ర సమాధానం ఇస్తానని నేతలకు సూచించారు. దీంతో కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.