Ex minister Kcr joined in yashoda: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులుగా సీజనల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన, గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు.
కేసీఆర్ గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుండి నగరంలోని నందినగర్ నివాసానికి చేరుకున్న ఆయనకు అక్కడే వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మరిన్ని వైద్య పరీక్షలు అవసరం కావడంతో, ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
జూన్ 11న కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైనప్పుడు కూడా కేసీఆర్ కొంత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓపెన్ కోర్టుకు రాలేనని, ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానని కమిషన్‌కు తెలియజేయగా, కమిషన్ సానుకూలంగా స్పందించింది. విచారణ అనంతరం ఆయన నేరుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన;
కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
గతంలో కూడా కేసీఆర్ ఆరోగ్య సమస్యల కారణంగా పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. కొన్ని నెలల క్రితం ఆయన తుంటి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్ రాజకీయాల్లో అంత చురుకుగా పాల్గొనకపోవడం కూడా తెలిసిందే.