భాగ్యనగరంలో వారాంతం వచ్చిందంటే.. ఎక్కడలేని మందుబాబులంతా బార్ షాపుల వద్ద బారులు తీరుతారు. శని, ఆదివారాల్లో మద్యం అమ్మకాలు చూస్తే.. ఎవరైనా షాకవ్వాల్సిందే. తాజాగా.. మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చారు పోలీసులు. ఇన్నిరోజులు ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేసిన మందంతా నకిలీదేననని తేలింది. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లాంటి శివారు ప్రాంతాల్లో ఉన్న మద్యం ప్రియులు సేవించింది నకిలీ సరుకని తేలింది. నిత్యం మందుతాగేవాళ్లకే కాదు.. ఫంక్షన్లు, దావత్‌లకు, ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికకు కూడా నకిలీ మందునే సరఫరా చేశారని తెలుస్తోంది. ఈ నగ్నసత్యం.. ఓ చిన్న బెల్టుషాపు వల్ల వెలుగులోకి రావడం గమనార్హం.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఎక్సైజ్ బృందం.. హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులపై కొనుగోలు దారుల్లావెళ్లి దాడిచేశారు. బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అది నకిలీ మద్యంగా గుర్తించారు. ఓ బెల్టుషాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. ఈ దందా వెనుక పెద్ద హస్తమే ఉన్నట్లు తెలిసిందని సమాచారం. అతనిచ్చిన సమాచారం మేరకు.. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌ని గుర్తించారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌లో సుమారు రెండు కోట్లకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఈ డంప్ అంతా దేవలమ్మ నాగారానికి చెందిన ఓ బడా మద్యం వ్యాపారి బింగి బాలరాజు గౌడ్‌కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇకనైనా మద్యం సేవించే వారు కళ్లు తెరిచి.. తాము సేవించేది అసలో నకిలీనో తెలుసుకోండి.. లేకపోతే ఇక అంతే సంగతి మరి.