Express Metro: హైదరాబాద్ మహానగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు ఈ రోజు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముందుగా నగరంలోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన ప్రదేశంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, సీఎం కేసీఆర్ శిలాఫలకం పైలాన్ ను ఆవిష్కరించారు.
ఈ మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పలువురు నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తంగా ట్రాఫిక్ చిక్కులతో చుక్కలు చూపిస్తోన్న ఎయిర్ పోర్ట్ ప్రయాణానికి త్వరలోనే పరిష్కారం లభిస్తోంది. హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్‌ను శంషాబాద్ విమానాశ్రయంతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ ఎక్స్ ప్రెస్ మెట్రోను తీసుకొస్తున్నారు.
మొత్తం 6250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ మెట్రోరైలు నిర్మాణానికి చేపట్టింది. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రోరైలు రెండవ దశ పూర్తి కానుంది. మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 26నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మెట్రో కారిడార్‌లోనే విమానాశ్రయ ప్రయాణాలకు చెక్ ఇన్ చేసుకోవచ్చు. తద్వారా విమానాశ్రయాల్లో రద్దీని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. డిసెంబర్ 13 వరకు కన్సల్టెన్సీల నుంచి ఈ మెట్రోకు బిడ్‌లను స్వీకరించనున్నారు.
మెట్రోకు శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ గారి ప్రసంగం : ముఖ్యాంశాలు :
• ప్రపంచమే అబ్బురపడేలాగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నం.
• దేశంలోని ఇతర నగరాలకంటే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
• హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల దూరం మెట్రోను వందకు వందశాతం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నది.
• హైదరాబాద్ నగరం దేశ రాజధాని ఢిల్లీకంటే ఎంతో గొప్పదైన చారిత్రక నగరం.
• ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో, జనాభాలో పెద్దదిగా ఉన్న నగరం హైదరాబాద్.
• 1912లోనే హైదరాబాదుకు కరెంటు వస్తే, మద్రాసుకు 1927లో కరంటు వచ్చింది.
• హైదరాబాద్ అన్నివర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని విశ్వనగరంగా అవతరించింది.
• హైదరాబాదులో సమశీతల వాతావరణం ఉన్నది. భూకంపాలు రాకుండా సేఫ్ గా ఉంటది.
• అన్ని భాషలు, సంస్కృతులు కలిగిన అన్ని రాష్ట్రాలు, దేశాల వారు ఇక్కడున్నరు.
• దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరంలో నివసించేందుకు ఇష్టపడుతరు.
• మన చార్మినార్ దగ్గర గుల్జార్ హౌజ్ 300 ఏండ్ల క్రితం నుంచే ఉన్నది.
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ వెనుకబడింది.
• ఆనాడు కరంటు కోసం ఇందిరాపార్కు వద్ద పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసినారు.
• నాడు మంచినీటి బాధలు కూడా మనం కండ్లారా చూసినం. నేడు పరిష్కరించుకున్నం.
• కృష్ణా, గోదావరి నుంచి పథకాలు ప్రారంభించినా, వాటికి క్లియరెన్సు లేవు. మనం ఆ క్లియరెన్సులు తెచ్చుకున్నం. పూర్తి చేసుకుంటున్నం.
• అట్లా నేడు హైదరాబాదును పవర్ సెక్టారులో ఐలండ్ గా మార్చుకున్నం.
• న్యూయార్క్, లండన్, ప్యారిస్ లో కరంటు పోవచ్చునేమోగానీ, హైదరాబాదులో మాత్రం కరెంటు పోదు
• దీంతో నేడు హైదరాబాదుకు 500 గొప్ప గొప్ప పరిశ్రమలు వచ్చినయి. వేలాది మందికి ఉపాధి కూడా దొరికింది.
• హైదరాబాదులో ఎస్సార్డీపీ పనులో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించుకున్నం. నేడు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుతున్నది.
• ఇక్కడ 40 అంతస్తులు, 60 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు కూడా కడుతున్నరు.
• హైదరాబాదులో ఆఫీస్ స్పేస్ కు గిరాకీ పెరిగింది. టీఎస్ బీపాస్ తో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం బాగా పుంజుకున్నది.
• ఎయిర్ పోర్టులో కూడా ట్రాఫిక్ పెరిగిపోవడంతో రెండో రన్ వే కూడా నిర్మించబోతున్నం.
• నేడు రూ. 6,250 కోట్లతో 31 కిలో మీటర్ల దూరం మెట్రోను మనమే కట్టుకుంటున్నం.
• ఇక్కడ భూముల సమస్యలున్నాయని స్థానిక ఎమ్మెల్యేలు చెప్పారు. పరిష్కరిస్తం.
• హైదరాబాద్ మెట్రోలో రోజుకు నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నరు.
• నేడు కాలుష్య రహిత, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెట్రోయే ఏకైక మార్గం
• హైదరాబాద్ అంతటా మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉన్నది.
• భవిష్యత్ లో బీహెచ్ఈఎల్, ఔటర్ రింగు రోడ్ వరకూ మెట్రో రావాలి.
• కేంద్రం సహకారం ఉన్నా, లేకున్నా మనం మెట్రోను మరింత అభివృద్ధి చేసుకుందాం
• పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో మరింతగా పనులు చేపట్టుకోవాల్సి ఉంది.
• భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతున్నది. పచ్చదనం పెంచి గ్రీన్ సిటీ హైదరాబాద్ అవార్డును కూడా మనం అందుకున్నం.
• వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డులు కూడా వచ్చినయి. అధికారులు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు.
• దేశంలో హైదరాబాద్ నిజమైన కాస్మొపాలిటన్ సిటీగా మారడం మనకు గర్వకారణం.
• హైదరాబాద్ లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని ప్రాథమిక అవసరాలను కల్పించాల్సిన అవసరం ఉన్నది.
• హైదరాబాదులో మౌలిక అవసరాలకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటది.
• జై తెలంగాణ.. జై భారత్..
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కె.తారక రామారావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిలతోపాటు, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, జైపాల్ యాదవ్, డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, , ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కె. నవీన్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, కె.జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మెట్రో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు, సీఎంవో అధికారులు భూపాల్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కే.ఎస్.రత్నం, ఈడిగ ఆంజనేయులు గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
అదనపు సమాచారం :
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్ మెట్రో రైల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మెట్రో మార్గంలో పిల్లర్లతోపాటు రెండున్నర కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని కూడా నిర్మించనున్నది. ఔటర్ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ మెట్రో మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియో గించనున్నారు. ప్రస్తుత మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్లు క్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లాట్‌ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 9 స్టేషన్లు ఉంటాయి. కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయి. మూడేండ్ల కాలంలో ఈ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేస్తారు.