Extremely heavy rains in Telangana: తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ (శుక్రవారం) ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీ చేసింది. ఈ జిల్లాల్లో వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నది నుంచి ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/tgpsc-group-1-final-results/
నిండు కుండలా ప్రాజెక్టులు..
మరోవైపు, తెలంగాణలోని ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా 3,66,816 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. దీని పూర్తి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 586.60 అడుగులు (303.4310 టీఎంసీలు) నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 3,20,046 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి బుధవారం 3.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అందులోంచి 3,45,730 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి 25 వేల క్యూసెక్కులు, జూరాల నుంచి 2.48 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది.
అధికారులకు సీఎం సూచనలు..
వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ‘‘అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలి. అన్ని చెరువు కట్టలను పరిశీలించాలి. వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలి. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేపట్టాలి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.


