ఆసిఫాబాద్ అడవుల్లో అడవి కుక్కల (Wild Dogs) సంచారానికి సంబంధించి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆసిఫాబాద్ పెంచికల్‌పేట పరిధిలోని అడవుల్లో గురువారం అడవి కుక్కలు కనిపించాయి. ఈ వీడియోలను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…
“ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట రేంజ్ లో అరుదైన అడవి కుక్కలు కనిపించాయి. ఏషియన్ వైల్డ్ డాగ్స్ (Asian Wild Dogs) గా ప్రాచుర్యం పొందిన ఈ కుక్కలు సామాన్యంగా జనాలకి కనిపించవు. కుమ్మర్గాం, మురలిగూడ మధ్య అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వీటిని గుర్తించారు” అని వీడియోలను షేర్ చేశారు.
అయితే ఈ ప్రచారంపై అటవీ అధికారులు స్పందించారు. అడవుల్లోని పెర్కోలేషన్ ట్యాంక్‌లో దాహం తీర్చుకునే క్రమంలో అడవి కుక్కల గుంపు కనిపించిందని పెంచికల్‌పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం అనిల్ కుమార్ తెలిపారు. కుక్కలు అరుదైన జాతులు కావని, సాధారణమైనవే అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో వన్యప్రాణుల వీడియోలు, ఫోటోలు షేర్ చేసేముందు వాస్తవాలను చెక్ చేయాలని ఆయన సూచించారు.