Mandous Cyclone: బంగాళాఖాతంలో పుట్టి ఇప్పటికే తీరం దాటిన మాండస్ తుఫాన్ దక్షణాది రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.. ఇంకా ఇప్పటికీ చేస్తుంది. మాండస్ తుపాను దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. మరో రెండు మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
ఇప్పటికే చాలాచోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తుండగా.. చేతికొచ్చిన పంట వర్షార్పణమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఓదెల మీదున్న ధాన్యం పూర్తిగా తడసిపోగా.. ఇంటి దగ్గర నిల్వ చేసుకున్న ధాన్యం కూడా రంగుమారుతోందని రైతులు వాపోతున్నా రు. ఒకరకంగా ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల ఆశలకు తుపాను గండి కొట్టింది. పెనమలూరు, గుడివాడ, పామర్రు, నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.
వర్షపు నీరు బయటకు పోయే అవకాశం లేకపోవడంతో వరి కుళ్ళి మొలకలు వస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట కోసి ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో పత్తి మూడోసారి తీసేందుకు రైతులు సిద్ధమవుతుండగా.. ఈ వర్షం దాన్ని కబళించేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎడతెరపి లేని వర్షాలతో మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.