కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల అధికార, విపక్ష నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సహా పలువురు నేతలు లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన తన తండ్రి సాయన్న గతేడాది ఫిబ్రవరిలో మృతి చెందగా ఇంకా ఆ బాధ నుంచి సాయన్న కుటుంబం పూర్తిగా కోలుకోక ముందే, ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరంగా మారింది.
ఉదయం ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఆమె వాహనం ప్రమాదానికి గురికావటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి లాస్య నందిత పాడె మోసి, నివాళులర్పించారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని స్మశానవాటికలో లాస్య నందిత అంత్యక్రియలు సాగాయి.