Fire Accident| జనగామ పట్ణణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున విజయ షాపింగ్మాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈలోపే పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. ఈ షాపు కూడా పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే జనగాం పట్టణంలో ఒకే ఫైర్ ఇంజిన్ ఉండటంతో మంటలను అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. దీంతో పక్కనే ఉన్న స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి ఫైరింజిన్లు తీసుకువచ్చారు. ప్రస్తుతం మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తులను చెలరేగుతుండటంతో స్థానికులు, షాపుల నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. షాపుల్లోని సరుకును ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే రూ.10కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిలినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.