ప్రపంచాన్ని వణికించిన కరోనా(Corona) మళ్లీ విజృంభిస్తోంది. మలేషియా, సింగపూర్, హాంకాంగ్, తదితర దేశాల్లో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కూడా కొవిడ్ కేసులు నమోదు కావడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏపీలోని వైజాగ్‌లో కరోనా కేసు నమోదుకాగా.. ఇప్పుడు తెలంగాణలోనూ ఓ వ్యక్తికి కరోనా సోకింది.
హైదరాబాద్(Hyderabad) లోని కూకట్ పల్లిలో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు RTPCR టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయనను క్వారంటైన్లో ఉంచామని, ఆయన ఇంట్లో సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకుని స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.