Impact of food waste in India : ఒకవైపు కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే.. మరోవైపు లక్షల టన్నుల ఆహారం వ్యర్థంగా కుప్పల్లోకి చేరుతోంది. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ చేదు నిజం మనల్ని వెక్కిరిస్తోంది. డబ్బును పైసా పైసా కూడబెట్టే మనం, అన్నం విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటున్నాం..? తినే దానికంటే పడేసేదే ఎందుకు ఎక్కువవుతోంది? ఈ ఆహార వృథా ఎక్కువగా ఎక్కడ జరుగుతోంది..? దీనివల్ల భవిష్యత్తులో మనకు ఎదురయ్యే పెను ప్రమాదం ఏమిటి..?
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటాం, కానీ ఆచరణలో మాత్రం దాన్ని ప్రహసనంగా మార్చేస్తున్నాం. దేశంలో రోజూ దాదాపు 20 కోట్ల మంది కడుపు నిండా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారని అంచనా. ఇదే సమయంలో, మన దేశంలో ఏటా ఏకంగా 78.2 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోందని ఓ నివేదిక చెబుతోంది. అంటే, ప్రతి భారతీయుడు సంవత్సరానికి సగటున 55 కిలోల అన్నాన్ని చెత్తబుట్టలో వేస్తున్నాడన్నమాట. ఈ వృథాను అరికడితే సుమారు 37 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చని ప్రపంచ ఆహార సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. డబ్బును పొదుపుగా వాడాలన్న స్పృహ ఉన్న మనకు, అంతకంటే విలువైన ఆహారంపై ఆ దృష్టి కొరవడుతోంది.
ఎక్కడెక్కడ వృథా : ఆహార వృథాలో సింహభాగం వివాహాలు, ఇతర శుభకార్యాల్లోనే ఉంటోంది. పళ్లెం నిండిపోయేలా రకరకాల పదార్థాలు వడ్డించుకోవడం, వాటిలో నాలుగైదు మాత్రమే రుచి చూసి మిగతాది పడేయడం పరిపాటిగా మారింది. జపాన్ వంటి దేశాల్లో చిన్న పరిమాణంలో ఉండే పళ్లాలను వాడతారు, దీనివల్ల అవసరమైనంతే వడ్డించుకుంటారు. కానీ మన దగ్గర ఆసక్తి లేకపోయినా, గౌరవం కోసమో, కంటికింపుగా కనబడాలనో పళ్లెం నిండా వడ్డించుకుని, సగానికి పైగా వదిలేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రోజుకు 20 క్వింటాళ్ల ఆహారం వృథా అవుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
రైతు ఆరు నెలల శ్రమ.. మన అర నిమిషం వృథా : మనం ఒక్క మెతుకును పడేసే ముందు, దాని వెనుక ఉన్న రైతు ఆరు నెలల శ్రమను గుర్తుంచుకోవాలి. రేయింబవళ్లు కష్టపడి, ఎండనకా వాననకా శ్రమిస్తేనే ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల ధాన్యం చేతికొస్తుంది. మనం వృథా చేసే ఆహారం కేవలం రైతు శ్రమను అవమానించడమే కాదు, భూమి, నీరు వంటి అమూల్యమైన సహజ వనరులను కూడా వ్యర్థం చేయడమే. ఈ ఆహార వ్యర్థాలు పర్యావరణానికి కూడా పెను ముప్పుగా మారుతున్నాయి.
వృథాను అరికట్టే మార్గాలు..
అంచనా ముఖ్యం: శుభకార్యాల్లో ఎంతమంది వస్తున్నారో కచ్చితంగా అంచనా వేసి, దానికి తగినంతే వండాలి.
కొనుగోళ్లలో జాగ్రత్త: దుకాణాల్లో అవసరానికి మించి ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దు.
మిగిలితే భద్రపరచాలి: ఆహారం మిగిలితే ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు ఉపయోగించుకోవాలి.
దానం చేయాలి: ఎక్కువగా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా సమీపంలోని అనాథ శరణాలయాలకు, ఆకలితో ఉన్నవారికి అందించాలి.
ప్రచారం కల్పించాలి: ఆహారం వృథా వల్ల కలిగే నష్టాలను, భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రజలకు విస్తృతంగా వివరించాలి. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఆహారాన్ని వృథా చేస్తే కోట్లాది మంది ఆకలిని, ప్రకృతి వనరులను తిరిగి తీసుకురాలేమన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.


