KCR deeply shocked over the Pashamilaram incident: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాకర్టీలో భారీ పేలుడు ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది కార్మికులు మృతి చెందడం పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సహాయం అందజేస్తుందని స్పష్టం చేశారు.
పాశమైలారం ప్రమాదం దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
కాగా పాశమైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.