Monday, July 14, 2025
HomeతెలంగాణKCR: కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్.. ఆసుపత్రికి కవిత

KCR: కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్.. ఆసుపత్రికి కవిత

KCR Health update: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నీరసంగా ఉండటంతో వ్యక్తిగత వైద్య సహాయకుడు సిఫార్సు మేరకు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు సోడియం లెవల్స్ తగ్గాయన్నారు. ఇందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నామన్నారు.

- Advertisement -

కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి శోభాదేవి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రిలో ఉన్నారు. వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రి కూడా కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన వెంటనే కవిత అక్కడికి ఆయనను పరామర్శించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం విధితమే. కేసీఆర్ కూడా ఆమెను పలకరించేందుకు అయిష్టంగానే ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఆమె అక్కడే ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలనఅ అధికారులకు ఆదేశించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి డిశ్చార్జ్ కావాలని ఆకాంక్షించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఆస్పత్రి కి చేరుకుని కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

అలాగే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వాకబు చేశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో త్వరగా కోలుకుని రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ తాకిడికి ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా గతంలో కూడా కేసీఆర్ అనారోగ్య సమస్యలతో పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. 2023 డిసెంబర్‌లో బాత్‌రూంలో కాలు జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గతా పాల్గొనడం లేదు. ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News