Ashanna Sensational statement: కోవర్టులుగా తమను చిత్రీకరిస్తున్న వారు.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కోరారు. తమలో విప్లవ తత్వం ఇంకా చనిపోలేదని స్పష్టం చేశారు. ప్రజాపోరాటాలు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు తనతో పాటు లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్‌గఢ్ నుంచి మాట్లాడిన వీడియోను ఆశన్న విడుదల చేశారు.
మాలో విప్లవ తత్వం చచ్చిపోలే: కేంద్ర కమిటీ స్థాయి నాయకులు లొంగిపోతే విప్లవ ద్రోహులుగా పేర్కొనడం చాన్నాళ్లుగా జరుగుతోందని ఆశన్న అన్నారు. మాపైనా అలాంటి నిందలే వస్తాయని ముందే ఊహించామని తెలిపారు. కానీ.. ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన భారీ నష్టాలకు మేమే కారణమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాము తప్పా..భయంతో కాదని అన్నారు. ఇప్పటికీ మాలో విప్లవ తత్వం చచ్చిపోలేదని తెలిపారు. తమకు ఏ స్వార్థం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధంగానే ఉన్నామని అన్నారు. అయితే.. కార్యాచరణ ప్రకటించేంత అనువైన పరిస్థితులు లేనందున.. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం ముఖ్యమని గ్రహించినట్టుగా ఆశన్న తెలిపారు.
మా శవాలపై ఎర్రగుడ్డలు కప్పి హీరోలను చేస్తారా..?: ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్‌లో కూర్చుని మాపై ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం సరికాదని ఆశన్న తెలిపారు.మేము పోరాడుతున్న గడ్డ (దండకారణ్యం)కు వచ్చి నిజాలు తెలుసుకుని మీరు మాట్లాడాలని అన్నారు. అప్పుడే మేము ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నామో మీకు తెలుస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో ఉండి సాయుధ పోరాటం చేయాల్సిందే అని మీరు అంటున్నారు..కానీ చేస్తే ఏమవుతుందో మీకు తెలియదా అని ప్రశ్నించారు. మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపై ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలను చేస్తారా అని ఎద్దేవ చేశరు.
ప్రాణత్యాగం వృధా: సమీప భవిష్యత్‌లో లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే తెగించి పోరాటం చేయడంలో తప్పులేదు.. కానీ అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రాణత్యాగం చేయడం వృధా అని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అన్నారు. విజ్ఞతతో ఆలోచన చేయాల్సిన సమయమని తేలిపారు.
సాయుధ పోరాట విరమణ బస్వరాజ్ నిర్ణయమే: సాయుధ పోరాట విరమణ అనేది పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బస్వరాజ్ బతికున్నప్పుడు తీసుకున్న నిర్ణయమేనని ఆశన్న అన్నారు. మేం 210 మంది అడవుల్లో నుంచి బయటకు రావడంపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సాయుధ పోరాట విరమణ చేయాలనేది ఏప్రిల్, మే నెలల్లోనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అప్పట్లోనే కర్రెగుట్ట, మాడ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉందని గ్రహించినట్టుగా పేర్కొన్నారు. అదే జరిగితే పార్టీకి పెద్ద నష్టం జరిగే అవకాశాలు ఉండటంతో ఆ నష్టాల నివారణకే పోరాట విరమణ ప్రక్రియపై పార్టీలో చర్చ జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఎదుర్కొనే పరిస్థితులతో అన్ని స్థాయుల క్యాడర్లతో చర్చించిన తర్వాతే బయటికి వచ్చామని అన్నారు.


