Babu Mohan: మాజీ మంత్రి, సీనియర్ నటుడు బాబు మోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణలోని ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరినట్లైంది. త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి బాబు మోహన్ సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కాగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బాబు మోహన్ తొలుత తెలుగుదేశం పార్టీలో చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆ పార్టీలో పొసగలేక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ టికెట్ ఆయనకు కాకుండా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడంతో అలకబూనారు. దీంతో కాషాయం పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయి పార్టీలో చేరికపై మంతనాలు జరిపారు.
తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేసి.. వచ్చే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లే ఇటీవల కాలంలో తెలంగాణ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దూకుడు పెంచారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మినహా రాష్ట్రంలోని మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతలందరూ తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు బాబు మోహన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే వీరంతా చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి తెలంగాణలోనూ పాగా వేయాలనుకుంటున్న పసుపు బాస్ ఆశలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి.