Harish Rao hot comments on Revanth cabinet: కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ దండుపాళ్యం ముఠగా మాదిరి ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. సీఎంతో సహా మంత్రులు పాలనను గాలికొదిలేసి.. పర్సనల్ పంచాయితీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం ఒకరు.. కాంట్రాక్టుల కోసం మరొకరు, వాటాల కోసం ఇంకొకరు, కబ్జాల కోసం, పోస్టింగుల కోసం తాపత్రయ పడుతూ ప్రజలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేబినెట్‌లో ఉన్న మంత్రులు ఒకటి కాదు. రెండు కాదు అరడజను వర్గాలుగా చీలిపోయారని అన్నారు. ఒకరంటే ఇంకొకరికి పడటం లేదని వ్యాఖ్యానించారు. గురువారం నాటి కేబినెట్ మీటింగ్‌లో ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారని అనుకున్నామని.. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. దసరాకు మొండి చేయి చూపారని.. దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపివార్త చెబుతరేమో అనుకుంటే తీవ్ర నిరాశను మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దాంట్లో కొట్లాటలేనని ఆరోపించారు. ఆ మంత్రి ఈ మంత్రిని తిట్టుడు.. ఈ మంత్రి ఆ మంత్రి తిట్టుడు ఇదే సరిపోయిందని తెలిపారు. అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్వయంగా మంత్రులే భయపడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
కమీషన్ల కోసం కుస్తీ: దీపం ఉండంగనే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ మంత్రులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. అధికారంలో ఉన్నపుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. రైతులకు బోనస్ పేరిట ఇచ్చే రూ.1300 కోట్ల బకాయిలైనా ఇస్తరేమో అనుకున్నం కానీ అది జరగలేదని అన్నారు. మహిళ లకు 2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తరేమో అనుకుంటే అది కూడా జరగలేదని తెలిపారు. పింఛన్లు అయినా పెంచుతరేమో అని అనుకుంటే అన్నింట్లో మొండి చేయి చూపారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఉద్యోగాల్లో 95శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారు. నీళ్లలో వాటా కోసం కొట్లాడారు. నిధుల వాటా కోసం కొట్లాడారు. నేడు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, అక్రమ వసూళ్లలో వాటా కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
Also read:https://teluguprabha.net/telangana-news/today-bc-jac-state-bandh/
నాడు గొడుగు పడితే.. నేడు గన్ ఎక్కు పెడతారా..?: పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారు లను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు దండుకోవడమే ప్రజా పాలన అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల టీఎస్ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిది ఏండ్లలో అతి తక్కువ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్లు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చాయన్నారు. 2024-25లో కేవలం 2049 పరిశ్రమలు, 50 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అన్నారు. ఇది కాంగ్రెస్ చేసిన ఘన కార్యమని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక వేత్తలకు మా ప్రభుత్వ హయాంలో రెడ్ కార్పెట్ వేశామని హరీశ్ రావు అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గన్ కల్చర్ తెచ్చారని ఆరోపించారు. అక్రమ వసూల్లకు పాల్పడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్ మహీంద్ర సీఈఓను నాడు కేటీఆర్ వర్షంలో గొడుగు పట్టి ఆహ్వానించిన అంశాన్ని గర్తుచేశారు. గన కల్చర్ గురించి మంత్రి కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. మంత్రులు కొట్టుకుంటుంటే డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.


