Gadwal collector’s order on teachers : పిల్లలు ధర్నా చేసినా, బడి మానేసి పొలం పనులకు వెళ్లినా.. ఇకపై బాధ్యత ఉపాధ్యాయులదే! వారిపై వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ జారీ చేసిన సంచలన ఆదేశాలు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీశాయి. విద్యార్థి చేసే తప్పునకు గురువును శిక్షించడం ఎంతవరకు సమంజసం..? అసలు కలెక్టర్ ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..?
ఇటీవల గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తరచుగా బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్న ఘటనలు పెరిగిపోయాయి.
గద్వాలలో నిరసన: తెలుగు ఉపాధ్యాయుడు లేడంటూ విద్యార్థులు పాఠశాల గేటు బయట ధర్నాకు దిగారు.
ఆలూరులో ఆందోళన: పాఠశాలలో తాగునీటి వసతి లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.
పొలం పనులకు : ధరూర్ మండలంలో ఏకంగా 19 మంది విద్యార్థులు బడి మానేసి, వ్యవసాయ పొలాల్లో పనులకు వెళ్లడాన్ని కలెక్టర్ స్వయంగా గుర్తించారు. ఈ ఘటనల నేపథ్యంలో, విద్యార్థులు పాఠశాల సమయంలో బయటకు వెళ్లకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సంబంధిత ఉపాధ్యాయుడిపై, అవసరమైతే ప్రధానోపాధ్యాయుడిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కొత్త నిబంధనలు.. కఠినంగా అమలు : ఈ ఆదేశాల ప్రకారం, ఇకపై పాఠశాలల్లో కఠిన నిబంధనలు అమలు కానున్నాయి.
మూవ్‌మెంట్ రిజిస్టర్ తప్పనిసరి: అత్యవసర పరిస్థితుల్లో, తల్లిదండ్రులు స్వయంగా వచ్చి, ‘మూవ్‌మెంట్ రిజిస్టర్’లో వివరాలు నమోదు చేసి, తరగతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి సంతకం తీసుకున్న తర్వాతే విద్యార్థిని బయటకు తీసుకెళ్లాలి.
సంఘాలపై చర్యలు: విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రధానోపాధ్యాయుడి అనుమతి లేకుండా విద్యార్థులను పాఠశాల నుంచి బయటకు తీసుకెళితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఉపాధ్యాయుల్లో ఆందోళన : కలెక్టర్ ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు నిరసన తెలిపితే, దానికి ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులున్న పాఠశాలలో, ప్రతి విద్యార్థిని గంటగంటకూ గమనించడం ఆచరణ సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


