తెలంగాణ ప్రభుత్వంలో కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు అనేక పథకాల ద్వారా కృషి చేస్తున్నట్టు ఇందులో భాగంగా వెనుకబడిన తరగతుల కులవృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం పథకాన్ని ఈ నెల 9న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు, సంగారెడ్డి నుండి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీషావు కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులతో బి.సి. కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం, 2వ విడత గొర్రెల పంపిణీ, ఆరోగ్య దినోత్సవం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి మాట్లాడుతూ… ఈ నెల 9న సంక్షేమ సంబురాలలో భాగంగా బిసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంతో పాటు 2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక సహాయం పథకంలో భాగంగా ఆన్లైన్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని, ప్రతి నెల దశల వారిగా లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇందుకు అర్హులైన అభ్యర్థులు కుల, ఆదాయం ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విచారణ చేపట్టిన లబ్దిదారుల జాబితా జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత వెబ్సైట్లో ఉంచాలని, స్థానిక శాసనసభ్యులు చేతుల మీదుగా జాబితా వరుస ప్రకారం ప్రతి నెల పారదర్శకంగా ఆర్థిక సహాయం పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మాట్లాడుతూ… బిసి కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి చొప్పున ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 9న లాంఛనంగా కులవృత్తుల ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని, కళ్యాణలక్ష్మీ మినహా ప్రభుత్వ పథకాల ద్వారా 50 వేల రూపాయల కంటే ఎక్కువగా లబ్ధి పొందని వారికి ఇందులో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం యూనిట్ను గ్రౌండ్ చేసి వారి ఫోటోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14న నిర్వహించనున్న వైద్య దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి అదనంగా 1 లక్ష రూపాయల నిధులు వైద్య శాఖ నుంచి విడుదల చేస్తున్నామని, పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. వైద్యశాఖలో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని, వైద్య విద్యార్థులను వేడుకలకు ఆహ్వానించాలని, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలసిస్, కంటి వెలుగు, కేసిఆర్ కిట్ లబ్దిదారులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు డి.మధుసూదన్ నాయక్, బి.రాహుల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.