Saturday, November 15, 2025
HomeతెలంగాణGanja Mafia: తెలంగాణలో గంజాయి గుప్పు... గ్యాంగ్‌స్టర్లతో తప్పని ముప్పు!

Ganja Mafia: తెలంగాణలో గంజాయి గుప్పు… గ్యాంగ్‌స్టర్లతో తప్పని ముప్పు!

Ganja smuggling in Telangana: గంజాయి వాసనతో పాటు ఇప్పుడు తుపాకుల మందు వాసన కూడా గుప్పుమంటోంది. ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అక్రమ రవాణా, ఇప్పుడు హింసాత్మక స్వరూపం దాల్చుతోంది. తనిఖీ చేసే అధికారులపైనే దాడులకు తెగబడటం, గంజాయితో పాటు మారణాయుధాలు పట్టుబడటం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అసలు తెరవెనుక ఉండి ఈ దందా నడిపిస్తున్న ఆ గ్యాంగ్‌స్టర్లు ఎవరు..? ఆంధ్రప్రదేశ్‌ను వదిలి ఒడిశా వైపు ఎందుకు కన్నేశారు..? అమాయకుల జీవితాలను పావులుగా వాడుకుంటూ వారు పన్నుతున్న వ్యూహాలేంటి..? ఈ కథనం వెనుక ఉన్న చీకటి కోణాలు…

- Advertisement -

సీలేరు టు ఒడిశా… రూటు మార్చిన మాఫియా: గతంలో గంజాయి మాఫియాకు ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు అడ్డాలుగా ఉండేవి. అయితే, అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో, అక్రమార్కులు తమ కేంద్రాన్ని ఒడిశాకు మార్చారు. ఆ రాష్ట్రంలోని మల్కన్‌గిరి, చింతూరు జిల్లాల అటవీ ప్రాంతాల నుంచి సరుకును సేకరిస్తున్నారు. అక్కడి నుంచి అటవీ మార్గాల్లో భద్రాచలం వంతెన మీదుగా గోదావరిని దాటించి, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పడానికి జాతీయ రహదారులను వదిలేసి, పల్లెలను కలిపే అంతర్గత రహదారుల ద్వారా హైదరాబాద్, ముంబయి, రాజస్థాన్‌లకు సరుకును చేరవేస్తూ కోట్లు దండుకుంటున్నారు.

గంజాయితో పాటు మారణాయుధాలు… అధికారుల్లో ఆందోళన: కేవలం గంజాయి రవాణా చేయడమే కాదు, స్మగ్లర్ల దగ్గర మారణాయుధాలు దొరకడం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

పాల్వంచ ఘటన: ఆగస్టు 21న పాల్వంచ వద్ద ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో 108 కిలోల గంజాయితో పాటు ఒక పిస్తోలు, ఐదు రివాల్వర్లు, 40 బుల్లెట్లు పట్టుబడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

నేరచరితులే నిందితులు: ఈ కేసులో పట్టుబడిన కేరళకు చెందిన బిలాల్‌పై ఏకంగా 100కు పైగా కేసులున్నాయి, 28 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇలాంటి అంతర్జాతీయ నేరగాళ్లు ఈ దందాలో ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. “కనీసం చేతిలో లాఠీ కూడా లేని మేము, ఇలాంటి ఆయుధాలున్న నేరగాళ్లను ఎలా ఎదుర్కోవాలి?” అని ఎక్సైజ్ సిబ్బంది వాపోతున్నారు.

డబ్బు ఆశ చూపి… మహిళలు, యువతే పావులుగా: ఈ దందాను నడిపించే అసలు సూత్రధారులు, ముంబయి, రాజస్థాన్‌లలోని గ్యాంగ్‌స్టర్లు సురక్షితంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

ఎరగా డబ్బు: సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి మహిళలు, నిరుద్యోగ యువకులు, చివరకు పిల్లలను కూడా ఈ రొంపిలోకి దింపుతున్నారు.

తాజా ఉదంతాలు: ఖమ్మంలో ఇద్దరు ఒడిశా మహిళలు 20 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. కిలోకు కేవలం రూ.1000 ఆశ చూపి వారిని ఈ అక్రమ రవాణాకు వాడుకున్నారు. అదేవిధంగా, రూ.2.12 కోట్ల విలువైన 424 కిలోల గంజాయిని రాజస్థాన్‌కు తరలిస్తున్న ముఠాను టేకులపల్లి పోలీసులు పట్టుకున్నా, వాహనంలోని వ్యక్తులు మాత్రమే దొరికారు, ప్రధాన నిందితులు తప్పించుకున్నారు.

రవాణా చేస్తూ దొరికినవారు జైలు ఊచలు లెక్కిస్తుంటే, తెరవెనుక ఉన్న పెద్ద తలకాయలు మాత్రం తప్పించుకుంటూ తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మారిన ఈ పరిస్థితులకు అనుగుణంగా పోలీసుల సహాయంతో దాడులు నిర్వహిస్తున్నామని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నా, మూలాలను పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad