ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించిన మలిదశ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించిన అభయహస్తం 6 గ్యారంటీల్లో ఉద్యమకారులకు చోటు కల్పించి తగిన గుర్తింపునిచ్చిందని మలిదశ ఉద్యమకారులు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ మోత్కూరి సాగర్ లు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ ఉద్యమంలో తమ మీద ఉన్న కేసుల ఎఫ్ ఐ ఆర్ నెంబర్ ను అభయహస్తం ఇందిరమ్మ పథకం ద్వారా దరఖాస్తు రాసి అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారులకు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు గత ప్రభుత్వంలో భంగపాటే మిగిలిందని తమకు సరైన ప్రాధాన్యత లభించలేదని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మలిదశ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అమరవీరుల కుటుంబాలలో ఒకరికి 20,000 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించి హామీలను అధికారంలోకి రాగానే అభయ హస్తం 6 గ్యారంటీలలో ఉద్యమకారులకు వారి కుటుంబాలకు చోటు కల్పిస్తూ వాటిని ప్రజా పాలన ద్వారా అమలు పరుస్తూ గౌరవించిందన్నారు.