ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిఎంహెచ్ ఓ కళావతి బాయి అన్నారు. గార్ల మండల పరిధిలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కళావతి భాయి సందర్శించారు. పీహెచ్సీలోని ఓపీ వార్డు, స్టోర్ రూం, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వర్షాకాలం నేపథ్యంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు అధికంగా ఉన్న గ్రామాలలో ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులకు సమాచారం అందించి శానిటేషన్ పనులు నిర్వహించిచేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో ర్యాపిడ్ సర్వే చేసి ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రతీ గర్భిణి ఆస్పత్రి రికార్డుల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే విధిగా పాటించాలన్నారు.
సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డి పి హెచ్ ఎన్ మంగమ్మ పి హెచ్ సి సిబ్బంది డాక్టర్ నవీన్ కుమార్ పిడిఎంఓ శ్రీహరి హెచ్ హీఓ సూపర్వైజర్ లు ఇస్మాయిల్ బేగ్ విజయలక్ష్మి వెంకటేశ్వరరావు వినోద శోభ శ్రీదేవి రత్నాకర్ లు ఉన్నారు.