గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో ధ్వజస్తంభం విరిగిపడిపోయింది. సాయంత్రం వీచిన ఈదురు గాలులకు అకస్మాత్తుగా ధ్వజస్తంభం కూలిపోవడంతో ఆ సమయంలో భక్తులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దబీమని ధ్వజస్తంభం కూలుతూ పెద్ద శబ్దం రావడంతో ఆలయ పరిసర ప్రాంత వాసులు గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పురాతనమైన ధ్వజస్తంభం లోపలి కర్ర పుచ్చిపోవడంతో అది కూలిపోయినట్లు అక్కడి వారు తెలిపడంతో దేవస్థానం కమిటీ నిర్వాహకులు ధ్వజస్తంభం కూలిన ఆనవాళ్లను పరిశీలించి, ఎండోమెంట్ అధికారి నందనం కవితకు సమాచారం అందించారు. సుమారుగా 26 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వేదమంత్రాలు సంపోక్షణ తరువాత ప్రస్తుతం ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని అనంతరం శాశ్వత గజ స్తంభం ఏర్పాటు చేస్తామని ఈవో నందనం కవిత తెలిపారు.