Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హద్దు మీరితే కఠిన చర్యలు

Garla: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హద్దు మీరితే కఠిన చర్యలు

తక్షణమే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు

నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై జీనత్ కుమార్ కోరారు. ఆదివారం రాత్రి జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని విలేకరుల సమావేశం ఆయన పేర్కొన్నారు. వేడుకలు సందర్బంగా మండల పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు నిర్ణీత సమయంలో ముగించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ట్రాఫిక్‌నకు అంతరాయం కలిగించే విధంగా సామాన్య ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేసారు. ప్రతి ఏటా నూతన సంవత్సర వేడుకలలో మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోవడం, వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. బైక్‌ల సైలెన్సర్లు తీసివేసి రణగొణ ధ్వనులను చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడిపినా, మత్తు పదార్థాలను వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా ఈ వేడుకల సమయంలో యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో పోలీసులకు పట్టుబడితే జరిమానాతోపాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. వేగంగా వాహనాలు నడపడం, రోడ్లపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే విధంగా వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పబోవని తెలిపారు. మండలంలోని అన్ని ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు అంక్షలను ఎవరైన అతిక్రమించినా, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. గార్ల మండల ప్రజలకు ఎస్ఐ జీనత్ కుమార్ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News