వానాకాలం సాగు కోసం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ లు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో ఎరువుల దుకాణాల యజమానులకు సమావేశం నిర్వహించి డీలర్లకు విత్తనక్రయ విక్రయాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుమతి కలిగిన గుర్తింపు పొందిన బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సదరు బిల్లును రైతులకు లార్డ్ నెంబర్ రేట్ల వివరాలతో అందించాలని సూచించారు. నాసిరకం, గడువు దాటిన విత్తనాలను రైతులకు అమ్మజూపినా, షాపుల యందు నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవన్నారు.
దుకాణాల ఎదుట ధరల సూచిక విత్తనాల నిల్వల పట్టిక విధిగా ఏర్పాటు చేయాలని, రైతులకు విక్రయించిన విత్తన బిల్లుల వివరాలను లాట్ నంబర్ ఇన్వాయిస్ నెంబర్ కంపెనీ పేరు రైతు మొబైల్ నెంబర్ విత్తన రకము తదితర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్ నందు పొందుపరచాలని, రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వడమే కాకుండా సీజన్ ముగిసే వరకు సదరు బిల్లును భద్రపరుచుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తి విత్తనాలలో హెచ్ టి హెర్బి సైడ్ టోలరెంట్ రకానికి ప్రభుత్వ అనుమతి లేదని, అట్టి విత్తనాలను రైతులకు ఇవ్వచూపరాదని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరువుల దుకాణ యజమానులు విత్తన వ్యాపారులు ఉన్నారు.