సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా తీర్చేందుకు అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది ఓవైపు ఎంతో శ్రమ పడుతుంటే ఇళ్ల యాజమానులు వ్యాపారులు మాత్రం ఖాళీ స్థలం ఉందా వేయండి చెత్త అనే ధోరణి కనిపిస్తుంది. కూడళ్లలో చెత్త వేయరాదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రతిరోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుంటున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్వచ్ఛత లక్ష్యానికి గండి కొడుతూ ఎప్పటికీ తమ ధోరణి మార్చుకోవడం లేదు. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు ఉదయం రోడ్లను ఊకి చెత్తను ఎత్తి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నా ఏమైతదిలే అన్నట్లుగా ఎక్కడపడితే అక్కడ, ఖాళీగా జాగా కనిపిస్తే చాలు ఆ స్థలాలను చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు.
చెత్తాచెదారంతో ప్లాస్టిక్ కవర్లు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తూ అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు మురుగు కంపు కొడుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఈగలు దోమల బెడద కూడా ఎక్కువవుతోంది. గ్రామ పంచాయతీ చెత్త వాహనం ద్వారా ప్రతిరోజు పలు వార్డులలో తిరుగుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. ఇలా ప్రతిరోజు చెత్త వాహనం ఇంటి ముందుకు వచ్చినప్పటికీ వాటిలో చెత్త వేయకుండా చెత్తను ఆరుబయటే వేయడం ద్వారా మరల ఆ చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది ఎత్తి చెత్త వాహనంలో పోయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు చెత్త వాహనం వచ్చినప్పుడు చెత్త వేయకుండా చెత్త బండి వెళ్లిన తర్వాత బయట వేయడంతో ఆ చెత్త కవర్లను పందులు ఆవాసంగా మార్చుకొని మరింత గలీజ్ చేస్తున్నాయి. ఇలా కొందరు చేసే నిర్వాకం వల్ల చుట్టుపక్కల జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది తగు చర్యలకు ఉపక్రమిస్తున్నా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్వచ్ఛత లక్ష్యానికి గండి కొడుతుండటంతో ఆశించిన ఫలితాలు చూపలేకపోతున్నాయి.
వ్యాపార సముదాయాల కూడలిలో ఇచ్చట చెత్త వేయరాదు అని రాసిన చోటే చెత్త వేయడం ప్రజల బాధ్యతా రాహిత్యాన్ని చాటుతోంది. చెత్త ఆరుబయట వేస్తే చర్యలు తప్పవు కార్యదర్శి కుమారస్వామి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీతో పాటు ఆరుబయట చెత్త వేయొద్దని ప్రచారం చేశాం. ఇంటితోపాటు చుట్టూ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తమ సిబ్బందితో ప్రతిరోజు వీధుల్లో కూడా శుభ్రం చేయిస్తున్నాం. దుకాణాలలో వచ్చే చెత్తను రోడ్ల మీద గానీ, ఖాళీ ప్రదేశాలలో వేయకుండా చెత్త డబ్బాలలో వేసి పారిశుధ్య సిబ్బందికి అందజేసి, సహకరించాలని ఆరుబయట ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధించి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.