Hyderabad Urban Development Project : ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ గురించి విన్నాం. ఢిల్లీలోని ‘ఇండియా గేట్’ చూశాం. కానీ, వాటన్నింటినీ మించిపోయేలా, విశ్వనగర ఖ్యాతిని దిగంతాలకు చాటేలా ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం స్వాగత తోరణమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్‌ను మూసీ నది ఒడ్డున నిర్మించి, హైదరాబాద్‌కు ఒక సరికొత్త ఐకాన్‌ను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు. అసలు ఈ బృహత్ ప్రణాళిక స్వరూపమేంటి..? దీనివల్ల హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి..? ఈ మహా నిర్మాణాల వెనుక ప్రభుత్వ లక్ష్యాలేమిటి…?
నగర సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈ అద్భుత కట్టడాలకు అంకురార్పణ చేశారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని స్పష్టం చేయడం ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ – నగరానికి నూతన ముఖద్వారం: హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు, సందర్శకులకు ఘన స్వాగతం పలికేలా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై, హిమాయత్ సాగర్ వద్ద ఉన్న గాంధీ సరోవర్ దగ్గర ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కేవలం ఒక నిర్మాణంలా కాకుండా, ఒక వైపున ‘ఎకో థీమ్ పార్క్’, మరోవైపు బాపూ ఘాట్ దిశగా భారీ ఐకానిక్ టవర్‌ను అనుసంధానించే ఒక ఎలివేటెడ్ కారిడార్‌గా రూపుదిద్దుకోనుంది. నగరం యొక్క వారసత్వం మరియు ఆధునికతకు ఇది ప్రతీకగా నిలవనుంది.
బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ఐకానిక్ టవర్: ఈసా, మూసా నదుల సంగమ స్థలమైన బాపూ ఘాట్ సమీపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీని సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి, ఎత్తును నిర్ధారించాలని సూచించారు. బాపూ ఘాట్ పరిసర ప్రాంతాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేలా ఒక ప్రపంచ స్థాయి జోన్‌గా తీర్చిదిద్దనున్నారు.
మెరుగైన కనెక్టివిటీ, కొత్త ఫ్లైఓవర్: ఈ ప్రాజెక్టులకు సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపునకు ఒక కొత్త ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్ గాంధీ సరోవర్ చుట్టూ ఒక కనెక్టివ్ కారిడార్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా, విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ సరోవర్‌కు చేరుకునేలా కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
బహుళ ప్రయోజనాలతో మూసీ పునరుజ్జీవనం: ఈ ఐకానిక్ కట్టడాలు కేవలం అందానికే పరిమితం కావు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తాగునీటి సరఫరా, వరద నీటి నిర్వహణ వంటి బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలు రూపొందించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇరువైపులా భూగర్భంలో భారీ నీటి నిల్వ సంపులను నిర్మించి, నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం అంతర్జాతీయంగా విజయవంతమైన నమూనాలను పరిశీలించాలని కూడా సూచించారు.


