నగరవాసుల కోసం జిహెచ్ఎంసి నగర వ్యాప్తంగా గ్రేవ్ యార్డ్ లను అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పంజాగుట్ట స్మశాన వాటిక అభివృద్ధి పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ప్రజల మనోభావాలకు అద్దం పడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ మతాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రేవ్ యార్డ్ లను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంజాగుట్ట స్మశాన వాటిక ను రూ. 1.90 కోట్ల వ్యయంతో జిహెచ్ఎంసి అభివృద్ధి చేయగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద పినిక్స్ సంస్థ రూ. 3 కోట్ల తో అధునాతనంగా మోడ్రన్ గ్రేవ్ యార్డ్ గా నిర్మించడం జరిగింది. ఈ మోడ్రన్ గ్రేవ్ యార్డ్ ను ఆగస్టు 25న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ స్మశాన వాటికలో త్రాగు నీరు, నిరంతరాయంగా కరెంట్, లాకర్ రూం లు, అంతర్గత రోడ్లు, రెస్ట్ రూం, టాయిలెట్స్, స్నానాల గదులు, క్రిమిటోరియం లు వంటి మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు పక్కనే ఉన్న ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఈ.ఎస్.ఐ లో కూడా మోడ్రన్ గ్రేవ్ యార్డ్ ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రేవ్ యార్డ్ ల మెయింటెనెన్స్ కోసం స్థానికంగా నివాసం ఉండే కుటుంబాలకు జీవనోపాధికై వారికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గ్రేవ్ యార్డ్ లో ఉల్లాసవంతంగా వాతావరణం కల్పించేందుకు ప్లాంటేషన్ విస్తృతంగా నాటుతున్నామని తెలిపారు.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… గ్రేవ్ యార్డ్ లో సకల సదుపాయాలతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నె కవిత, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రె, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఎస్.ఇ రత్నాకర్, ఇ.ఇ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.