Tuesday, September 17, 2024
HomeతెలంగాణGodavarikhani: సింగరేణి సంస్థ అమ్మేందుకు కేంద్రం కుట్ర

Godavarikhani: సింగరేణి సంస్థ అమ్మేందుకు కేంద్రం కుట్ర

కార్మిక పోరాటాలకు బిఆర్ఎస్ అండ

బొగ్గు గనుల వేలాన్ని తక్షణమే నిలిపివేయకుంటే ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బొగ్గు గనుల వేలానికి నిరసనగా జరిగిన కార్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -

ఎన్నికల ముందు సింగరేణి రక్షిస్తామని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి బిజెపికి వంత పాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే ధ్యేయంగా బిజెపి పని చేస్తున్న విషయాన్ని కార్మికులు గమనించాలని కోరారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, వారి బాటలోనే బిజెపి పయనించి ప్రజల, ప్రభుత్వ రంగ సంస్థల ఊపిరి తీస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. లక్షలాది మందికి జీవితాన్ని ప్రసాదించిన సింగరేణి సంస్థను కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

బలమైన కార్మిక ఉద్యమాల ద్వారానే సింగరేణి సంస్థను ఆదుకుంటామని స్పష్టం చేశారు. నాలుగు బొగ్గు గనుల వేలంతోనే ఈ ప్రక్రియ ఆగదని, సింగరేణిని నష్టాల బూచి చూపి మూసివేసే వరకు కాంగ్రెస్, బిజెపి నాయకులు పనిచేస్తారని పేర్కొన్నారు. ఐక్య పోరాటాల ద్వారా సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలు, పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం మందికి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని మర్చిపోరాదని పేర్కొన్నారు.

టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీనియర్ నాయకులు కౌశిక హరి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె  కొమరయ్య,కేంద్ర నాయకులు పర్లపల్లి రవి, సంపత్ రెడ్డి, బండి రమేష్, ఓ రాజశేఖర్, ఎన్.సదానందం, కనకం శాంసన్, బడికల సంపత్ కుమార్, వివిధ డివిజన్ల ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలీ శ్రీనివాస్, నాగేల్లి సాంబయ్య, పెట్టం లక్ష్మణ్, మేడిపల్లి సంపత్, మల్రాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News