లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(LRS) రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. అయితే ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో మరింత మంది లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రాయితీపై ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. లే ఔట్ల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరింది. ఈ పథకం ద్వారా అనధికార లే ఔట్లను క్రమబద్ధీకరించి నగర ప్రణాళికను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 15.27 లక్షల దరఖాస్తులు రాగా.. 15,894 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన 2.6 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో 58,032 దరఖాస్తులకు సంబంధించి అధికారుల ద్వారా ప్రోసీడింగ్స్ ఇచ్చినట్లు పురపాలక శాఖ వెల్లడించింది.