Health ATMs In PHCs: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీహెచ్‌సీల్లో ‘హెల్త్ ఏటీఎం’లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాగా, రెండు నెలల క్రితం హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రి, మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ వీటిని అభివృద్ధి చేయగా.. క్షణాల్లోనే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో రక్త, మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి, జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చి, రోగ నిర్ధారణ అవ్వడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుండగా.. వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో త్వరితగతిన ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఏంలను పీహెచ్‌సీల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు (బీపీ), బరువు, ఎత్తు, బీఎంఐ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను వెంటనే నిర్ధారిస్తాయి. ఇంకా రక్తంలో గ్లూకోజ్(షుగర్), ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ టెస్టులతో పాటు, డెంగ్యూ, మలేరియా, హెచ్‌ఐవీ వంటి వ్యాధులకు సంబంధించిన రాపిడ్ టెస్టులు కూడా త్వరితగతిన నిర్వహిస్తాయి. హెల్త్ ఏటీఎంలు ఏకంగా 132 రకాల పరీక్షల ఫలితాలను నిమిషాల్లోనే అందిస్తాయని అధికారులు చెబుతున్నారు.
రోగికి సంబంధించి హెల్త్ రికార్డు మొత్తం డిజిటల్ రూపంలో తయారవడం వల్ల సురక్షితంగా స్టోర్ చేయొచ్చు. అంతేకాకుండా హెల్త్ టెస్టుల అనంతరం రోగి ఈ యంత్రం ద్వారానే డాక్టర్ ఎక్కడ ఉన్నా అతడితో వర్చువల్‌గా మాట్లాడే అవకాశం ఉంది. హెల్త్ ఏటీఎంలో రోగి డేటా ఆధారంగా డాక్టర్ సూచనలు, చికిత్స అందించే వెసులుబాటు ఉంటుంది.
కాగా, ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ఏటీఎంల ద్వారా రికార్డు చేసిన రోగి టెస్టు ఫలితాలు.. టీ డయాగ్నస్టిక్ సెంటర్‌తో పాటు, ప్రైవేట్ ల్యాబ్‌ల టెస్టులతో కూడా సరిపోలాయి. దీంతో హెల్త్ ఏటీఏంలు ఇచ్చే ఫలితాలు చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయని వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో హెల్త్ ఏటీఎంలపై సమీక్షించారు.
అయితే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ హెల్త్ ఏటీఎంలు సేవలందిస్తున్నాయి. ముందుగా ఆయా రాష్ట్రాల్లో వీటి పనితీరుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడంపై మళ్లీ ఒక కమిటీని నియమించనున్నారు. ఆ కమిటీ నివేదిక అనంతరం వీటిని కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.


