Governor jishnu dev varma: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు లైన్ క్లియర్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజ్‌భవన్ ప్రకటించింది . స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్న విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం నెలకొంది తప్పా.. బీసీలకు 42 శాతం రిజర్వేష్‌న్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. గడువు సమయం కేవలం 20 రోజులు మాత్రమే ఉండటంతో రేవంత్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని.. సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-cabinet-meeting-on-15th-of-this-month/
జీవో ద్వారా వెళ్లే అవకాశం: స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఖరారు చేసింది. రాష్ట్రపతి వద్దకు గవర్నర్ పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో.. జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై సైతం మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అది కూడా వీలు కాకపోతే పార్టీ పరంగా 42శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కూడా వీలు కాకపోతే హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో పాత రిజర్వేషన్ల ప్రకారం.. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఏదిఏమైనా ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


