అర్హులైన రైతులకు ‘రైతు భరోసా’(Rythu Bharosa) నిధులు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.12వేలు అందజేస్తామని పేర్కొంది. సాగు భూములన్నింటికి పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు కూడా మార్గదర్శకాలు అర్థం కావాలనే ఉద్దేశంతో ఉత్తర్వులను తెలుగులో జారీ చేసింది.
అయితే భూభారతి(ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ సాగు భూములకే రైతు భరోసా సాయం అందించనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. డీబీటీ పద్దతిలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా సాయాన్ని జమ చేయాలని అధికారులను ఆదేశించింది.