పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్న 6,000 మంది ఆర్పీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం శోచనీయం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 6,000 మంది ఆర్పీలకు ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీల పెండింగ్ జీతాలను చెల్లించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు.