Thursday, December 11, 2025
HomeతెలంగాణCitizens Act : ప్రేమకు ద్రోహం.. ఆస్తికి మోసం: తాతను గెంటేసిన మనవడికి హైకోర్టు...

Citizens Act : ప్రేమకు ద్రోహం.. ఆస్తికి మోసం: తాతను గెంటేసిన మనవడికి హైకోర్టు షాక్!

Senior citizen property rights : రక్తం పంచుకు పుట్టిన మనవడు.. కంటికి రెప్పలా కాపాడతాడనుకుంటే.. కడతేర్చలేని వేదన మిగిల్చాడు. ప్రేమతో సర్వస్వం రాసిస్తే, అదే ప్రేమను సమాధి చేసి, కన్న తాతనే నడివీధిలో నిలబెట్టాడు. ఇది కేవలం ఒక ఆస్తి తగాదా కాదు, మానవ సంబంధాలు మంటగలుస్తున్న తీరుకు, కృతజ్ఞతను మర్చిపోయిన కలికాలపు వికృత చేష్టకు నిలువుటద్దం. 

- Advertisement -

మనవడిపై పెంచుకున్న ప్రేమ, అపాత్రదానం చేశానని గ్రహించిన ఓ వృద్ధుడికి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అండగా నిలిచింది. ఆస్తి చేతికి చిక్కాక గెంటేసిన మనవడి నుంచి ఇంటిని తిరిగి తాతకే అప్పగించాలంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

అంచెలంచెలుగా జరిగిన దారుణం
ప్రేమతో రాసిచ్చిన ఇల్లు: సి.రాములు (91), ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. తన కష్టార్జితంతో కీసర మండలం కొత్తపేటలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఎనిమిదేళ్ల క్రితం కుమారుడు అకాల మరణం చెందడంతో, పెద్ద మనవడైన శ్రీనివాస్‌ను సర్వం తానై చూసుకున్నారు. ఆ ప్రేమతో, తన తదనంతరం మనవడి భవిష్యత్తు బాగుండాలని, 2018లో తన ఇంటిని గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) ద్వారా శ్రీనివాస్ పేరిట రాశారు.

మారిన మనసు.. వీధిన పడ్డ బతుకులు: ఇల్లు తన పేరిట మారిందో లేదో, శ్రీనివాస్ అసలు స్వరూపం బయటపడింది. కొన్ని నెలలకే తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. కన్నతల్లి అని కూడా చూడకుండా, తోడబుట్టిన సోదరుడనే కనికరం లేకుండా, చివరికి తన సర్వస్వం రాసిచ్చిన తాతయ్య రాములును సైతం ఇంటి నుంచి గెంటేశాడు. ఆస్తి రాసిచ్చిన పాపానికి ఆ వృద్ధుడు తన కోడలు, మరో మనవడితో కలిసి నడివీధిలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

న్యాయపోరాటానికి శ్రీకారం: మోసపోయానని గ్రహించిన రాములు కుంగిపోలేదు. వృద్ధులకు అండగా ఉన్న ‘తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం-2007’ను ఆశ్రయించారు. 2021లో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. కేసును పలుమార్లు విచారించిన జిల్లా కలెక్టర్, మనవడి చర్యలను తీవ్రంగా పరిగణించి, శ్రీనివాస్ పేరిట ఉన్న గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం జారీ చేశారు.

హైకోర్టులో మనవడి వితండవాదం: కలెక్టర్ ఆదేశాలను సవాలు చేస్తూ మనవడు శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించాడు. “నాకు తాత బహుమతిగా రాసిచ్చిన పత్రాల్లో.. ఆయన్ను పోషించాలని ఎక్కడా నిబంధన లేదు. కాబట్టి గిఫ్ట్ డీడ్ రద్దు చేయడం చెల్లదు” అనేది అతని ప్రధాన వాదన. ఈ కేసుపై జస్టిస్ పుల్లా కార్తిక్ సుదీర్ఘంగా నాలుగేళ్ల పాటు ఇరువైపుల వాదనలు విన్నారు.

చట్టం చెప్పిన నీతి.. హైకోర్టు చరిత్రాత్మక తీర్పు : జస్టిస్ పుల్లా కార్తిక్, శ్రీనివాస్ వాదనను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తాజా తీర్పులను ఉటంకిస్తూ, “గిఫ్ట్ డీడ్‌లో పోషించాలనే నిబంధన ప్రత్యేకంగా లేకపోయినా, బహుమతి పొందిన తర్వాత వృద్ధులను నిర్లక్ష్యం చేయడం, వారి బాగోగులు చూడకపోవడం వంటి చర్యలే ఆ బహుమతిని రద్దు చేయడానికి సరిపోతాయి” అని స్పష్టం చేశారు. ప్రేమ, నమ్మకం, పోషణ అనే మౌలిక సూత్రాలపై ఆధారపడి ఇచ్చిన బహుమతిని, ఆ నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు రద్దు చేసే అధికారం చట్ట ప్రకారం అధికారులకు ఉందని తేల్చిచెప్పారు. కలెక్టర్ నిర్ణయమే సరైనదని సమర్థిస్తూ రెండు నెలల క్రితం తుది తీర్పును ప్రకటించారు.

గెలిచిన న్యాయం.. మిగిలిన పోరాటం : హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచినప్పటికీ, శ్రీనివాస్ ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో, సి.రాములు మళ్లీ మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి, హైకోర్టు తీర్పును అమలుపరిచి, తనకు తన ఇంటిని ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు.

వృద్ధుల సంక్షేమ చట్టం-2007 – ఓ వజ్రాయుధం : ఈ చట్టం ప్రకారం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను లేదా సీనియర్ సిటిజన్లను పోషించకుండా నిర్లక్ష్యం చేసే పిల్లలు, బంధువులకు కఠిన శిక్షలుంటాయి. వారిని సరిగా చూసుకోకపోతే మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల వరకు జరిమానా విధించే అధికారం ఉంది. అంతేకాకుండా, పోషణ నిమిత్తం ఆస్తిని బహుమతిగా పొంది, ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే, ఆ బహుమతి పత్రాన్ని రద్దు చేసే అధికారం కూడా ఈ చట్టం కల్పిస్తోంది. ఇది వృద్ధులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News