Saturday, November 15, 2025
HomeతెలంగాణGOVT SCHEME: ఇందిరమ్మ ఇంటికి 'ధన' భరోసా.. తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు!

GOVT SCHEME: ఇందిరమ్మ ఇంటికి ‘ధన’ భరోసా.. తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు!

GST cut on construction materials : సొంతింటి కల… ప్రతీ పేదవాడి జీవితాశయం. ఆ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టినా, నిర్మాణ సామగ్రి ధరలు లబ్ధిదారులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఓ చల్లని కబురు అందించింది. ఇంటి నిర్మాణానికి కీలకమైన సిమెంట్, స్టీల్‌పై జీఎస్టీని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్ధిదారులకు ఎంత మేర ఆదా కానుంది..? ఈ ప్రయోజనం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..? క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లేంటి..?

- Advertisement -

జీఎస్టీ తగ్గింపు.. వేలల్లో ఆదా : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, లబ్ధిదారులపై భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పన్ను కోత: సిమెంట్, స్టీల్‌పై ఉన్న 28 శాతం జీఎస్టీ (వస్తు సేవల పన్ను)ని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. ఈ కొత్త ధరలు ఈ నెల 21వ తేదీ తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి.

ఎంత మిగులుతుంది: సాధారణంగా ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సుమారు 180 బస్తాల సిమెంట్, 1500 కిలోల స్టీలు అవసరం. జీఎస్టీ తగ్గింపుతో బస్తా సిమెంట్‌పై సుమారు రూ.35, టన్ను స్టీలుపై రూ.550 వరకు ధర తగ్గుతుంది. ఈ లెక్కన ఒక్కో ఇంటి నిర్మాణంపై లబ్ధిదారుడికి సుమారు రూ.7,000 నుంచి రూ.15,000 వరకు అదనంగా మిగిలే అవకాశం ఉంది.

ఒకవైపు ఊరట.. మరోవైపు ఇసుక చింత : ప్రభుత్వం సిమెంట్, స్టీల్ ధరల రూపంలో ఊరటనిచ్చినా, మరోవైపు ఇసుక సమస్య లబ్ధిదారులను వేధిస్తోంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నా, అది లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెక్‌డ్యామ్‌లలోకి ఇసుక చేరినా, నీటి ఉధృతి కారణంగా ప్రస్తుతం వెలికితీయలేని పరిస్థితి నెలకొంది. మరో 20 రోజులు ఆగితే గానీ ఇసుక అందుబాటులోకి రాదు. ఈ లోపే ఇసుక దళారుల పాలుకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

అండగా స్వశక్తి సంఘాలు : నిర్మాణాలు వేగవంతం చేసేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం స్వశక్తి సంఘాల (SHG) ద్వారా రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. సెర్ప్ ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామైక్య సంఘాల ద్వారా లబ్ధిదారులకు ప్రత్యేక రుణాలను మంజూరు చేస్తున్నారు.

కామారెడ్డిలో కదలిక : కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 12,090 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 11,883 ఇళ్లను మంజూరు చేశారు. సుమారు 6,000 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి, వర్షాలకు ఇళ్లు కోల్పోయిన అర్హులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో అధికారులు అర్హుల గుర్తింపు ప్రక్రియను ముమ్మరం చేశారు. ధరల తగ్గింపుతో మిగిలిన లబ్ధిదారులు కూడా త్వరగా పనులు ప్రారంభిస్తారని అధికారులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad