బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈనెల 23వ తేదీ నుండి నియోజకవర్గం
వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిన్నారం, గుమ్మడిదల మండల కేంద్రాలలో పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ కాలంలో లాఠీలకు, జైళ్లకు భయపడకుండా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని అన్నారు. అదే స్ఫూర్తితో స్వరాష్ట్రంలో పార్టీకి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తూ బంగారు తెలంగాణ రూపకల్పనలో కార్యకర్తలు కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ చేయించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ అన్నారు. 65 లక్షల సభ్యత్వంతో అజేయ పార్టీగా బీఆర్ఎస్ ఎదిగిందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈనెల 23 నుండి ప్రారంభం కానున్న ఆత్మీయ సమావేశాలకు ప్రతి కార్యకర్త, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్, రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.