Guinness World Record Bathukamma: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మరో ఘనత సాధించింది. నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఈ అద్భుతం సాకారమైంది. హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో పూలను పేర్చారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడిపాడారు. మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి అందరినీ అలరించారు. ఇకపోతే, బతుకమ్మ సంబరాల భాగంగా ఎల్‌బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మహిళల బైక్, సైకిల్ ర్యాలీ కూడా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించగా, ఆయనే సైకిల్‌పై పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. హైదరాబాద్‌కు చెందిన మహిళా బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణలో బుల్లెట్ బైకులపై పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/saddula-bathukamma-in-telangana/
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ..
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ వేడుకలతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడుతున్నారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతున్నారు.


