ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిసలైన కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల్లో కలిసిమెలిసి తిరిగేవారు. ఐదు సార్లు శాసనభకు ఎన్నికైన ఎలాంటి అహంకారం, దర్పం ప్రదర్శించరు. సామాన్యుడిలా జీవిస్తూ ఆదర్శంగా నిలస్తున్నారు. గతంలో అసెంబ్లీకి కూడా సైకిల్ లేదా ఆటో, బస్సులో వెళ్లేవారు. ఓ గ్రామానికి సర్పంచ్ అయితేనే అధికారం దర్పం ప్రదర్శించే ఈరోజుల్లో ఇలాంటి అరుదైన నాయకులు ఎక్కడో చోట ఉంటారు. అలాంటి నాయకుడు ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయన మరెవరో కాదు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య(Gummadi Narsaiah)
తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని కలవాలని నాలుగుసార్లు యత్నించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారు కానీ సీఎంను కలిసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, తదితర సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించాలని ప్రయత్నిస్తున్నా ఇంటి గేటు వద్దనే నిలువరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
