Kakatiya Zoo animal adoption : ఓ పులి పోషణ బాధ్యత మీది.. ఓ నెమలికి ఆరు నెలల ఆహారం మీ భరోసా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వన్యప్రాణులపై ప్రేమను చూపడానికి, వాటి సంరక్షణలో భాగస్వాములు కావడానికి హనుమకొండలోని కాకతీయ జంతు ప్రదర్శన శాల ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం వెయ్యి రూపాయలతో కూడా మీరు ఓ జీవిని దత్తత తీసుకోవచ్చు తెలుసా..? అసలు ఏమిటీ దత్తత పథకం..? దీనిలో ఎలా భాగస్వాములు కావాలి..? ఏ జంతువుకు ఎంత ఖర్చవుతుంది..?
ఓరుగల్లుకే తలమానికం.. కాకతీయ జూపార్క్ : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ తర్వాత రాష్ట్రంలో అంతటి ప్రాచుర్యం పొందింది హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జంతు ప్రదర్శన శాల. ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన తెల్లపులి, అడవి దున్నలు, చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, రామచిలుకలు వంటి 436 రకాల జంతువులు, పక్షులు ఇక్కడ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వీటి రోజువారీ ఆహారం కోసమే అధికారులు సుమారు రూ.14,000కు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ బృహత్తర యజ్ఞంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకే అటవీ శాఖ ఈ దత్తత పథకాన్ని ప్రోత్సహిస్తోంది.
మంత్రులు, ప్రముఖుల ఆదర్శం : ఈ మంచి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జూపార్కులోని అడవి దున్న (బైసన్)ను ఏడాది పాటు దత్తత తీసుకుని, దాని పోషణ కోసం రూ.2 లక్షలు చెల్లించారు.
‘కుడా’ ఛైర్మన్ ఇనుగాల వెంకట్‌రాంరెడ్డి, నిప్పుకోడిని దత్తత తీసుకుని రూ.60 వేలు అందించారు. హనుమకొండకు చెందిన మంద రఘునాథ్ జాతీయ పక్షి నెమలి దత్తతకు రూ.10 వేలు, ఆచార్య కృష్ణ తన కుమార్తె పేరిట నెమలి పోషణకు రూ.6,000 చెల్లించి ఆదర్శంగా నిలిచారు.
మీరూ దత్తత తీసుకోవచ్చు.. ఇలా : జంతు ప్రేమికులు ఎవరైనా ఈ పథకంలో పాలుపంచుకోవచ్చు. మీ ఆర్థిక స్థోమతను బట్టి ఏడాది, ఆరు నెలలు, లేదా మూడు నెలల పాటు జంతువుల పోషణ బాధ్యతను స్వీకరించవచ్చు. నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి, ఆ మూగజీవాల సంరక్షణలో మీ వంతు పాత్ర పోషించవచ్చు.
దత్తత వివరాలు:
పెద్ద పులి: ఏడాదికి రూ. 4,00,000, ఆరు నెలలకు రూ. 2,00,000, మూడు నెలలకు రూ. 1,00,000.
చిరుత: ఏడాదికి రూ. 22,000.
ఎలుగుబంటి: ఏడాదికి రూ. 60,000.
అడవి దున్న: ఏడాదికి రూ. 50,000.
ఇతర జంతువులు: మచ్చల జింక, నెమలి, రామచిలుక వంటి అనేక జంతువులను కూడా దత్తత తీసుకోవచ్చు. ఆసక్తి గలవారు జూ కార్యాలయాన్ని సంప్రదించగలరు.
ఈ పథకంలో పాల్గొనడం ద్వారా మనం కేవలం జంతువుల ఆకలి తీర్చడమే కాదు, వాటి సంరక్షణపై సమాజంలో అవగాహన పెంచిన వారమవుతాం. మరింత మంది ముందుకు రావాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.


