Saturday, November 15, 2025
HomeతెలంగాణSLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీకి సైనిక స్ఫూర్తి.. సొరంగం పనులకు సర్కార్ సరికొత్త వ్యూహం!

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీకి సైనిక స్ఫూర్తి.. సొరంగం పనులకు సర్కార్ సరికొత్త వ్యూహం!

Telangana irrigation project advisor appointment : దశాబ్దాలుగా నత్తనడకన సాగుతూ, ఇటీవల ఘోర ప్రమాదంతో మరింత అనిశ్చితిలో కూరుకుపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం పనులకు జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక అడుగు ముందుకేసింది. అపార అనుభవం, అసాధారణ నైపుణ్యం కలిగిన సైనిక నిపుణుడిని రంగంలోకి దించుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఎవరా నిపుణుడు..? ఆయన రాకతో దశాబ్దాల కల నెరవేరుతుందా..? ప్రాజెక్టు ముందున్న సవాళ్లేంటి..?

- Advertisement -

దక్షిణ తెలంగాణకు జీవనాడిగా భావిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పరుగులు పెట్టించే లక్ష్యంతో, భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ముఖ్యంగా సొరంగ నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించి, నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది.

హర్ పాల్ సింగ్ నేపథ్యం ఏమిటి : లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) హర్ పాల్ సింగ్ భారత సైన్యంలో ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డైరెక్టర్ జనరల్‌గా సుదీర్ఘ అనుభవం గడించారు. హిమాలయాల వంటి అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులలో రోహ్‌తంగ్ (అటల్ టన్నెల్), జోజిలా టన్నెల్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన, ప్రపంచ ప్రఖ్యాత సొరంగాల నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర. ఆయన నైపుణ్యం, ఆధునిక టెక్నాలజీపై ఉన్న పట్టు, క్లిష్టమైన ప్రాజెక్టులను విజయవంతం చేసిన ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఎల్‌బీసీకి ఉన్న అడ్డంకులను తొలగించగలరనే బలమైన విశ్వాసంతో ఈ బాధ్యతలను అప్పగించింది.

ఎస్‌ఎల్‌బీసీకి సైనిక బృందం అండ : కేవలం హర్ పాల్ సింగ్‌తో ఆగకుండా, టన్నెల్ నిర్మాణంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నిపుణుడు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన కల్నల్ పరిక్షిత్ మెహ్రాను కూడా నీటిపారుదల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఈ ఇద్దరు సైనిక నిపుణుల బృందం ఎస్‌ఎల్‌బీసీ పనులను పర్యవేక్షించనుంది. ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన సొరంగం ప్రమాదం, కూలిన ప్రదేశంలో చిక్కుకున్న యంత్రాన్ని తొలగించడం సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణులు తేల్చడంతో, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సొరంగం పనులు సాగుతున్నందున, పర్యావరణ అనుమతులకు అనుగుణంగా, భూగర్భ పరిస్థితులను అంచనా వేయడానికి డెన్మార్క్ నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఎలక్ట్రో-మాగ్నెటిక్ సర్వే పరికరాలతో పాటు, లైడార్ (LiDAR) ఏరియల్ సర్వేను కూడా వినియోగించనున్నారు. ఈ సర్వేల ద్వారా సొరంగ మార్గంలోని శిలల స్వభావం, నీటి ఊటలు, బలహీనమైన ప్రాంతాలను గుర్తించి, పటిష్టమైన భద్రతా చర్యలతో పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండి, ఎందరో ముఖ్యమంత్రులను చూసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు, ఇప్పుడు సైనిక నిపుణుల చేతికి వెళ్లడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. హర్ పాల్ సింగ్ నేతృత్వంలోని బృందం తమ అనుభవంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక గ్రహణాన్ని వదిలించి, దక్షిణ తెలంగాణ మెట్ట ప్రాంతాల రైతుల సాగునీటి కలను సాకారం చేస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad