ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరోవైపు చేతికందిన పింఛన్‌ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.
“కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల? అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4వేలు పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ. 2వేల పింఛన్ ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య.
ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరోవైపు చేతికందిన పింఛన్‌ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయం. మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం, నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటిపన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.” అని హరీశ్ రావు రాసుకొచ్చారు.