ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సవాల్ విసిరారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఎండబెట్టి, కుడి కాలువ నిండుగా నీళ్ళు తీసుకువెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండని సవాల్ విసిరారు. అప్పుడు తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ వాటా తీసుకున్నారని.. మరి తెలంగాణకి ఎందుకు నిధులు ఇవ్వలేదు అని ప్రశ్నించలేదన్నారు. తెలంగాణ హక్కుల కోసం ఏనాడు చంద్రబాబు పోరాడలేదన్నారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నట్లు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కాపాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా కేంద్రాన్ని అడగాలని సూచించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని హరీష్ రావు నిలదీశారు.