అబద్ధపు పునాదులపై, పచ్చి మోసపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి అన్నదాతలు నిలువునా మోసపోయారని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గడిచెర్లపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక నుంచి ఎనుముల రేవంత్ రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తామన్నారు.
రుణమాఫీ అయిపోయిందని సీఎం చెబుతుంటే.. రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. దమ్ముంటే సిద్దిపేటకి వస్తారా…లేదంటే కొండారెడ్డిపల్లిలోని గ్రామసభకు వస్తారా.. రుణమాఫీ అయ్యిందో లేదో చూద్దామంటూ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఏడాది క్రితం ప్రజల నుంచి వివిధ పథకాల అమలుకు దరఖాస్తు తీసుకున్నారని.. నేటికీ వాటికి దిక్కులేదని మండిపడ్డారు. ఇచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు ఇవ్వాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.