Harish Rao Comments on Banakacharla Project: తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతోందని మాజీ మంత్రి హరీష్‌రావు జోస్యం చెప్పారు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి కనీస స్పందన కరువైందని దుయ్యబట్టారు. బనకచర్ల నీళ్లు ఏపీ తరలించుకుపోతుంటే ఆయన ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతారా? స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసింది. కేంద్రం లేఖపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించట్లేదో చెప్పాలి. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర తరలిస్తామని చెబుతున్నాయి. కృష్ణా జలాలను తరలిస్తామని కర్ణాటక, మహారాష్ట్ర చెబుతున్నాయి.’ అని హరీశ్‌రావు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా పరోక్షంగా ఏపీకి సహకరిస్తోందని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శలు నిజమవుతున్నాయని వివరించారు. తెలంగాణ నుంచి 423 టీఎంసీలు ఏపీ మళ్లీంచుకుంటోందని విమర్శించారు. 112 టీఎంసీలు ఆల్మట్టిలో ఆపుకుంటామని కర్నాటక ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు.
తెలంగాణ పాలిట బనకచర్ల పెను ప్రమాదంగా మారబోతోందని, తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. పైన కర్నాటక కింద ఏపీ కృష్టా జలాలు మళ్లించుకుంటే చూస్తు కూర్చుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు వద్దా?
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిందని, అయినా సీఎం రేవంత్, సాగునీటి మంత్రి ఉత్తమ్ మౌనంగా ఉంటున్నారని హరీశ్ నిప్పులు చెరిగారు. సీఎం, మంత్రులకు కేటీఆర్ మీద, బీఆర్‌ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. తెలంగాణ జలహక్కుల పరిరక్షణపై లేదని విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతున్నా.. టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తాతాలిక ఒప్పందానికి మించి ఏపీ కృష్ణా జలాలను తీసుకుపోయినా ఎందుకు మాట్లాడరని, గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండీ బనకచర్లపై నోరు మెదపడం లేదని నిప్పులు చెరిగారు. రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టుపై ఆనాడు మహారాష్ట్రతో చంద్రబాబు పోరాటం చేశారని, మరి నేడు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎంత పోరాటం చెయ్యాలని హరీశ్ ప్రశ్నించారు. మరి రేవంత్‌రెడ్డి ఎందుకు ఒక మాట కూడా మాట్లాడటం లేదని నిలదీశారు.


