ఎస్‌ఎల్‌బీసీ(SLBC) టన్నెల్ సహాయక చర్యలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో ఇప్పటికీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు.
కార్మికులను కాపాడటంలో ప్రతి క్షణం చాలా ముఖ్యమైందన్నారు. ఐదు రోజు నుంచి లోపల వారికి ఆహారం, తాగునీరు లేవని.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy)హెలికాప్టర్ వేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా.. ఎన్నికల ప్రచారం ముఖ్యమా అని ప్రశ్నించారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే ఇంతవరకు అక్కడికి వెళ్లలేదని.. కానీ ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే అక్కడి వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి SLBC టన్నెల్ వద్దకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు.