రిటైర్మెట్ బెనిఫిట్స్ అందక దిక్కుతోచని స్థితిలో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా? అని ప్రశ్నించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గం. 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా?.
2024 మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు 8 వేల మంది పిఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసీ, కమ్యుటేషన్, సరెండర్ లీవ్ తదిదర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయి, మానసిక వేదనకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో, విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించింది.
బిడ్డ పెళ్లి కోసం ఒకరు, కొడుకు ఉన్నత విద్య కోసం మరొకరు, భార్య అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం మరొకరు.. ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడం ఉద్యోగులు, టీచర్ల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపుతున్న కర్కశత్వానికి నిదర్శనం. ఇప్పటికైనా కండ్లు తెరవాలని, ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన 80- 90 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాం.’’ అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.