ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట మీద నిలబడేవాడైతే ఇచ్చిన హామీలు అమలు చేసి ఓటు అడగాలని, పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదన్నారు. కృష్ణ నీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పగించి సంతకం పెట్టింది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందన్నారు. రేవంత్ దగ్గర విషయం లేదు కనుకే విషం చిమ్ముతున్నాడని, రేవంత్ నీ అతి తెలివి బంద్ చేయి. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? బిల్లును తయారుచేసింది మీ జైపాల్ రెడ్డి, జైరాం రమేశ్ కాదా?
రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నీటి సమస్యలను తీసుకొస్తున్నాడు. హైదరాబాద్‌కు మంచినీటి సమస్య వస్తుంది. ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగిస్తే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్‌లకు సాగు నీరు, తాగునీటికి సమస్య వస్తుంది. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదు. పెదవులు మూతపడ్డాయి. రేవంత్.. నీ వీపు చూసుకుని మాట్లాడన్నారు హరీష్.
పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమేన్న హరీష్, పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశామన్నారు. ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లా మీ ముఖాన విసిరేసిన చరిత్ర మాదని, సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ పైనే పడుతుందని రేవంత్ ను హెచ్చరించారు. రేవంత్ సబ్జెక్ట్ లేక చవకబారు మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు టీవీలో చూస్తే పిల్లలు అసహ్యించుకుంటారన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్య నాయుడుగారు ఉదయం రేవంత్‌కు చెప్పారు. రేవంత్ మధ్యాహ్నాం చిల్లర మాటలు, అసభ్యపు మాటలు మాట్లాడారన్నారు.
ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టు, నీకు దిమ్మతిరిగే సమాధానం చెప్తాం బిడ్డా అంటూ హరీష్ హూంకరించారు. మేం గతంలో చర్చకు పెడితే ప్రిపేర్ కాలేదని కాంగ్రెస్ తప్పించుకుంది. మేం అలా కాదు, ధైర్యంగా చర్చకు వస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారన్నారు. రైతుబంధు, పింఛన్ పెంపు, ఉచిత కరెంట్, రుణమాఫీ హామీలపై మాట తప్పింది మీరు కాదా? మల్కాజ్‌గిరి ఎంపీ స్థానాన్ని మనం తప్పకుండా గెలవాలి. ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాలంటే ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలి. ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలి. పట్టుదలతో పనిచేయాలన్నారు హరీష్.