తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వే (Caste Census Survey) పత్రాలు రోడ్డుపై దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల గోప్యత కాపాడాల్సిన ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడమేంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత వారం మేడ్చల్‌లోని రేకుల బావి చౌరస్తా నుంచి ఎల్లంపేట వరకు రోడ్డుపక్కన విచ్చలవిడిగా కుల గణన సర్వే (Caste Census Survey) దరఖాస్తులు కనిపించాయి. అప్పుడే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ నేడు (శుక్రవారం) మరోసారి హైదరాబాద్ లోని తార్నాక మెట్రో స్టేషన్ వద్ద సర్వే పత్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సర్కార్ పై బీఆర్ఎస్ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు.. నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు.. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం. రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలి” అని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.