తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకుని మామ చాటు అల్లుడిగా మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) రూ.10వేల కోట్లు సంపాదించుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని వ్యాఖ్యానించారు.
దీంతో కోమటిరెడ్డి ఆరోపణలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామని.. ఇప్పడు అసెంబ్లీ దగ్గర కూడా ఈ టెస్ట్ చేయాలన్నారు. కొందరు సభ్యులు సభకు తాగొచ్చి సోయ లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. హరీష్ వ్యాఖ్యలుతో సభలో ఒక్కసారిగా దుమారం రేగింది. కాంగ్రెస్ సభ్యులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో సభలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.