బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాల వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు, కేటీఆర్(KTR)కు మధ్య విభేదాలున్నాయన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపారు. ఒకవేళ కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తానని తేల్చిచెప్పారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, అందరం కేసీఆర్ నాయకత్వంలోనే కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ అంశంపై చాలాసార్లు స్పష్టతనిచ్చానని గుర్తు చేశారు. కేసీఆర్ మాటే నా బాట. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ గీత దాటే ప్రసక్తి లేదు అని హరీశ్ రావు వెల్లడించారు. కాగా ఇటీవల పార్టీలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.